మాయాబజార్ (1957) చిత్ర సాంకేతిక విశ్లేషణ

Harish Parthu
7 min readNov 22, 2020

The English Translation version of this article is in a separate post right below.

“ఈ చిత్ర నిర్మాణంలో ఏ ఒక్క అంశం యాదృచ్ఛికం కాదు!” అని తను తీసిన మెట్రోపొలిస్ (1927) గురించి చెప్తూ దర్శకుడు ఫ్రిట్జ్ లాంజ్ అన్నాడు.

గమనిక: ఈ విశ్లేషణ కేవలం ఫిల్మ్ మేకర్స్ మరియు మాయాబజార్ చిత్ర నిర్మాణం వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనుకునే వారికి మాత్రమే!

నేను ఈ చిత్ర సాంకేతిక అంశాలను విశ్లేషించే ముందు సింగీతం శ్రీనివాసరావు గారు ‘మాయాబజార్: మధుర స్మృతులు’ అనే పుస్తకానికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక భాగాన్ని చదవండి:

దీని ద్వారా ఈ చిత్రాన్ని ఎంత సూక్ష్మ దృష్టితో ఆలోచించి తీశారో అర్ధమవుతుంది!

ఛాయాగ్రహణం: సింగీతం శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పగా విన్నాను. మార్కస్ బార్ట్లే గారు ఎన్టీఆర్ గారి మీద లూప్ లైట్ని (ముక్కు నీడ చిన్నగా, వలయాకారంలో రావటం) బ్యాక్ గ్రౌండ్ తో కాంట్రాస్ట్ వచ్చేలా చెయ్యటం కోసం గంటల కొద్దీ సమయం వెచ్చించే వారట. అలాగే ‘నీ కోసమే నే జీవించునది’ పాటలోని సావిత్రి గారు దోమతెర లోపల ఉండే షాట్లలో ఆమె చర్మం మరియు దోమతెర సరైన కాంతిలో కనిపించటం కోసం బర్ట్లేగారు షూటింగ్ కి ముందు రోజు సాధన చేసేవారట. మాయాబజార్ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ దాదాపు సంవత్సరం పాటు సాగింది. ఈ చిత్ర ఛాయాగ్రహణం ఏ లోపం లేకుండా అందంగా కనిపించటానికి బర్ట్లేగారు ప్లానింగ్ దశలో చేసిన సాధనని బలమైన కారణంగా చెప్పుకోవచ్చు.

బర్ట్లేగారు ‘లాహిరి లాహిరి లాహిరిలో’ పాటలోని కొంత భాగం పగలు ఔట్డోర్ లో షూట్ చేసి, మిగతా భాగం స్టూడియోలో షూట్ చేసి ఆ రెండిటినీ కలిపి మాచ్ చేసిన విషయం గురించి మీ అందరూ వినే ఉంటారు.

నిజానికి బర్ట్లేగారు కేవీ రెడ్డి గారి కాంబినేషన్లో చేసిన పాతాలభైరవి చిత్రంలో ఇలాంటి ఒక ప్రయోగం చేశారు: ఔట్డోర్ లో తీసిన అడవి షాట్లలోని లైటింగ్ పాటర్న్ ని స్టూడియో లోపల తీసిన షాట్లతో మాచ్ చేశారు. మాయాబజార్ లోని పాట విషయానికి వస్తే ఏ షాట్ ఔట్డోర్లో తీసారో, ఏ షాట్ ఇండోర్లో తీసారో తెలుసుకోవటానికి ఒక కిటుకుంది. మీరు నది బ్యాక్ గ్రౌండ్ ని గమనిస్తే, బ్యాక్ గ్రౌండ్ సాధారణంగా కదులుతున్న షాట్లు ఔట్డోర్లో తీసినవి. కొన్ని షాట్లలో నది బ్యాక్ గ్రౌండ్ కదులుతున్నట్టు అనిపిస్తుంది కానీ కదలదు. ఆ షాట్లు ఇండోర్లో రియర్ ప్రొజెక్షన్ (నటీనటుల వెనుక తెర కట్టి ఆ తెర పై బ్యాక్ గ్రౌండ్ని ప్రోజెక్ట్ చెయ్యటం) ఉపయోగించి చిత్రీకరించారు. ఔట్డోర్ లొకేషన్లో పగలు తీసిన షాట్లు మేఘావృతమైన వాతావరణంలో తీసారు కావున ఆకాశం బ్లో అవుతూ కనిపించదు. అలాగే పగటి పూట ధారాళంగా వచ్చే కాంతిని అదుపు చెయ్యటానికి ND ఫిల్టర్ని వాడటం జరిగింది. నటీనటుల మొఖం మీద నీటి ప్రతిబింబం ఏర్పడటానికి అల్ల్యుమినియం షీట్ తో కాంతిని ప్రతిబింబించారు.

ఈ చిత్రంలో దృశ్య పరంగా నాకు నచ్చిన అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను:

భూకంపం: ఈ సీక్వెన్స్ ని చాలా సరళంగా షూట్ చేసినప్పటికీ ప్రేక్షకుల పై ప్రభావం బలంగా ఉంటుంది. ఈ షాట్లలో కెమెరాను వేగంగా ఊపుతూ, లైట్లను ఫ్లాష్ లాగా ఆపుతూ, ఆన్ చేస్తూ; షాట్లో కనిపించే వస్తువుల్ని కింద పడేశారు. వీటికి తోడు నక్క అరిచే సౌండ్ ఎఫెక్ట్ ని వాడటంతో భూకంపం లాంటిదేదో వస్తుందనే భ్రమ కలిగించారు.

ట్రాలీ పుష్ ఇన్ షాట్లు: కథనంలోని కీలకమైన సందర్భాలను ట్రాలీ పుష్ ఇన్ల ద్వారా హైలైట్ చేశారు. (కింద వీడియోలోని ఆ షాట్ల సందర్భం మీకు గుర్తుండే ఉంటుంది.)

లైటింగ్:

  1. శశిరేఖని రేవతి దేవి కొట్టే సన్నివేశం మొత్తం శశిరేఖని హై కీ లైటింగ్లో చిత్రీకరించారు. చెంపదెబ్బ పడ్డ తర్వాత శశిరేఖ మంచం పై కూలబడినప్పుడు, రేవతి దేవి ఆ గది తలుపుని మూసి వెళ్ళిపోవటం శశిరేఖ ఆశల్ని తన తల్లి అంతమొందించటాన్ని సూచిస్తుంది. ఆ షాట్ కంపోజిషన్ ఎంత నాటకీయంగా ఉందో చూడండి. ఈ కథలో శశిరేఖ అభిమన్యుడిని, తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అద్దం శశిరేఖ మనసుని సూచిస్తుంది. ఈ సన్నివేశంలో గది తలుపులు మూసుకోవటాన్ని నేరుగా కాకుండా, అద్దంలో చూపిస్తారు; శశిరేఖ మనసు గదులు మూసుకుపోయినట్టు. ఇక పోతే ఆమె మంచం మీద కూలబడ్డప్పడినప్పుడు తను పడుతున్న బాధని సూచిస్తూ లో కీ లైటింగ్లో ఆమె మొఖం మీద బలమైన నీడ వచ్చేలా చిత్రించారు.

2. శకుని లక్ష్మణ కుమారుడికి ఎర వేసి శశిరేఖతో పెళ్లికి ఒప్పించే సన్నివేశంలో అతడి కపటి బుద్దిని సూచించేలా లో కీ లైటింగ్లో అతడి మొఖంగా అస్థిరంగా నీడలు వచ్చేలా చిత్రీకరించారు.

3. సుభద్ర దేవి బలరాముడితో అభిమన్యుడు — శశిరేఖ పెళ్లి విషయంలో వాదించే సన్నివేశంలో మిగతా పాత్రలను కాంతివంతంగా చిత్రీకరిస్తే, బలరాముడిలో ఉండే చీకటి కోణాన్ని సూచిస్తూ, లో కీ లైటింగ్లో ఆయన మొఖం మీద సగం వరుకు బలమైన నీడలు వచ్చేలా చేశారు.

4. శకుని మరియు పాండవులు తన అసలు రంగులను పాండవుల ముందు బయటపెట్టే సన్నివేశంలో వారిలోని చెడుని సూచిస్తూ లో కీ లైటింగ్లో చిత్రీకరించడం జరిగింది. లైట్లని వాళ్ల కాళ్ల కింద 45 డిగ్రీల కోణంలో పెట్టడం వల్ల వాళ్ల మొఖం మీద మొఖానికి సంబంధించిన భాగాలు దళసరిగా నీడలను ఏర్పరుస్తాయి.

5. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ పాటలోని మొదటి షాట్లో వెన్నెల అనే అనుభూతిని కలిగించటానికి తెల్లటి ఆకులు కలిగిన మొక్కల్ని ప్రత్యేకంగా తెప్పించి వాటిని లైట్ సోర్స్ ముందు పెట్టి బ్యాక్ లైట్లో చిత్రీకరించటంతో ఆ మొక్కలు మెరుస్తూ కనిపిస్తాయి.

6. ‘నీ కోసమే నే జీవించునది’ పాట చివరి షాట్లో లైట్ సోర్స్ ని ఒక వైపు నటీనటుల కంటే కొంత ఎత్తులో పెట్టి వారి మొఖం పై నీడలు నాటకీయంగా వచ్చేలా చేసి, మరో వైపు రిఫ్లెక్టర్ పెట్టి ఆ నీడల తీవ్రతను తగ్గించారు. కెమెరా లెన్స్ కి వేజలిన్ రాసి లైటింగ్లో డిఫ్యూజన్ కలిగేలా చేసారు.

7. లైట్ కుకీలు, ఫ్లాగ్స్ను వాడి వెనుక బ్యాక్ గ్రౌండ్ గోడల పై నీడలు ఏర్పడేలా చేసి షాట్లలో డైమెన్షన్నిసృష్టించారు:

ఎడిటింగ్:
ఇంటలెక్చువల్ మొంటాజ్: కథనంలో భాగంగా వచ్చే షాట్లని వేరే అసందర్భ షాట్లకి కట్ చేసి ఆ రెండిటి మధ్య కవితాత్మకమైన అనుసంధానాన్ని కలిగించటమే ఇంటలెక్చువల్ మొంటాజ్. శశిరేఖ ‘నీవేనా నను తలచినది..’ పాటలో ఆనందంతో నాట్యమాడుతుంటే ఆ షాట్లని ఎగసిపడుతున్న సముద్ర కెరటాల షాట్లతో ఇంటర్ కట్ చేస్తారు.

మాయాబజార్ ఎడిటింగ్

ఫాస్ట్ కట్స్: పాత బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో ఫాస్ట్ కట్స్ అసలు కనిపించవు. మాయాబజార్లో శ్రీకృష్ణుడు ప్రియదర్శినిని తెరవగా అందులో శకుని తన కపట వేషంలో కనిపించి ఒక్క క్షణం అందరినీ ఆందోళనకు గురి చేస్తాడు. ఆ ఆందోళనని పాత్రధారుల పై ఫాస్ట్ కట్స్ ద్వారా సూచిస్తారు.

వైరుధ్య భావాల సీన్ ట్రాన్సిషన్: రేవతీ దేవి శశిరేఖ ను కొట్టి, ఆమె బాధతో ఏడ్చేలా చేస్తుంది. ఈ షాట్ తరువాయి సన్నివేశంలో వచ్చే అందమైన వెన్నల షాట్ కి కట్ చేసి భావద్వోగంలో పూర్తి వైరుధ్యాన్ని కలిగిస్తారు.

స్పెషల్ ఎఫెక్ట్స్:

(ఈ సెక్షన్లో మాయాబజార్లో ప్రతీ స్పెషల్ ఎఫెక్ట్ ని ఎలా సాధించారో వీలైనంత స్పష్టంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. అప్పట్లో కంప్యూటర్లు, ఆప్టికల్ ప్రింటర్లు లేకపోవటం వల్ల ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నిటినీ కెమెరా లోపలే సృష్టించారని గుర్తు చేస్తున్నాను.)

మాయాబజార్ స్పెషల్ ఎఫెక్ట్స్ లో మొట్టమొదటిగా చెప్పుకోవలసింది మినియేచర్ సెట్స్ గురించి. పెద్ద పెద్ద సెట్లు నిర్మించే బడ్జెట్ నిర్మాతల దగ్గర లేనప్పుడు ఆ సెట్లను చిన్నవాటిగా రూపొందించి వాటి పై షూట్ చేస్తారు. ఈ పద్ధతిని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తీసే VFX చిత్రాలలో వాడుతున్నారు. ఈ రెండూ మాయాబజార్లోని మినియేచర్ షాట్లకి ఉదాహరణలు:

మినియేచర్ సెట్లు

సింగీతం శ్రీనివాసరావు గారు మాయాబజార్: మధురస్మతులు అనే పుస్తకంలో ఈ సినిమాలో వాడిన వేలాడే మినియేచర్ షాట్ల గురించి ప్రస్తావించారు. కెమెరా ముందు కొంత భాగం వేలాడే మినియేచర్ ని ఉంచి, మిగతా భాగంలో అయితే ఒక రియల్ లొకేషన్ ని లేదా మరో మినియేచర్ సెట్ ని అలైన్ అయ్యేలా ఉంచుతారు. దీని వల్ల బడ్జెట్ మిగలటంతో పాటూ, విజువల్లో 3D డెప్త్ కనపడుతుంది. సింగీతం గారు చెప్పినప్పటికీ మాయాబజార్లో ఏ షాట్లలో వేలాడే మినియేచర్లని వాడారో నేను పసిగట్ట లేెకపొయాను.

శశిరేఖ ఒకే షాట్లో ఎదగటం:
శశిరేఖ ఒకే షాట్లో పెరిగి పెద్దదవటం అప్పుడున్న ఫిల్మ్ మేకింగ్ ఒరవడిలో ఒక సంచలనం. చిన్నప్పటి శశిరేఖ షాట్ ని, పెద్దయ్యాక సావిత్రి గారి షాట్ తో మెల్లగా డిజాల్వ్ చెయ్యటం ద్వారా ఈ ఎఫెక్ట్స్ ని సాధించారు. కెమెరా చిన్నప్పటి శశిరేఖ నుండీ టిల్ట్ డౌన్ అయ్యి కొలనులో నీటిని కాసేపు చూపిస్తుంది. ఆ నీటిలో ఉన్న పూమోగ్గలని గమనించండి, అవి మెల్లగా పెరిగిన పువ్వులుగా డిజాల్వ్ అవ్వగానే, సావిత్రి గారున్న రెండో షాట్ మొదలవుతుంది. నీటి అలలు మన దృష్టిని మల్లిస్తాయి.

మాయాబజార్ స్పెషల్ ఎఫెక్ట్ షాట్లు

డబుల్ ఎక్స్పోజర్:

ప్రియదర్శిని లోపల కదిలే మనుషులు కనిపించే ఎఫెక్ట్ ని డబుల్ ఎక్స్పోజర్ ద్వారా సాధించారు. సినిమాలు ఫిల్మ్లో షూట్ చేసే రోజుల్లో ఫిల్మ్ ని రెండు సార్లు ఎక్స్పోజ్ చేసి కొన్ని ఎఫెక్టులు సాధించేవారు. ఫిలింలోని కొంత భాగాన్ని ఒక సారి ఎక్స్పోజ్ చేసేటప్పుడు మిగతా భాగం మీద కాంతి పడకుండా మాట్ బాక్స్ వాడి మూసేసేవారు. అదే ఫిల్మ్ ని రెండో సారి ఎక్స్పోజ్ చేసేటప్పుడు ముందుగా ఎక్స్పోజ్ అయిన భాగాన్ని మూసేసి, ఎక్స్పోజ్ కాని భాగాన్ని ఎక్స్పోజ్ చేసేవారు. మాయాబజార్ లో ప్రియదర్శిని ని ముందుగా షూట్ చేసేటప్పుడు దానిని డిస్ప్లే భాగం (మ్యాట్ బాక్స్ వాడి) కనపడకుండా దాచారు. తరువాత ఈ ఎక్స్పోజ్ అవ్వని బాగాన్ని రెండో సారి పాత్రధారులను షూట్ చేసేటప్పుడు దాచేసి, ఇంతకు ముందు ఎక్స్పోజ్ కాని భాగం ఎక్స్పోజ్ కాకుండా చేశారు. దాని ఫలితంగా పాత్రధారులు ప్రియదర్శిని డిస్ప్లే లోపల కదులుతున్న భ్రమ కలిగించారు.

జంప్ ఇంపాక్ట్:

ఘటోత్కచుడు అభిమన్యుడి తో పోరాడటానికి ఒక పెద్ద బండరాయి మీదకి దూకినప్పుడు అతని సామర్ధ్యాన్ని సూచించేలా భూమి కంపించిన ఎఫెక్ట్ పెట్టారు. దానితో పాటుగా ఆయన దూకగానే, ఆ బండ రాయిలోని ఒక భాగం విరిగి పడినట్టు చూపించారు. ఈ షాట్ ని స్టూడియో సెట్లో చిత్రించడం జరిగింది. భూమి కంపించే ఎఫెక్టుని సాధించటానికి ఛాయాగ్రాహకుడు షాట్ తీసే సమయంలో కెమెరాని ఊపటం జరిగింది. తెగిపడిన చిన్న బండ రాయి ఒక సెట్ పీస్. దానిని పెద్ద బండ రాయి వెనుక నిలబడ్డ సెట్ అసిస్టెంట్ సరిగ్గా ఎస్వీ రంగారావు గారు దూకే సమయానికి విసిరేశాడు. ఘటోత్కచుడు దూకిన వేగాన్ని త్వరితం చెయ్యటానికి తక్కువ ఫ్రేమ్ రేట్లో షూట్ చెయ్యటం జరిగింది.

స్టాప్ మోషన్:

(మీకు స్టాప్ మోషన్ అంటే ఏంటో తెలియని పక్షంలో దయచేసి ఈ టాపిక్ కి సంబంధించి యూట్యూబులో కొన్ని వీడియోలు చూసి రండి. ఎందుకంటే దాని గురించి ఇక్కడ వివరించటం కష్టం.)

స్టాప్ మోషన్ షాట్లు

ఘటోత్కచుడి అసిస్టెంట్ మాయాబజార్ ని సృష్టించే షాట్లతో పాటు “వివాహభోజనంబు..” పాటలోని కదిలే ఆహార పళ్ళాల షాట్లని కూడా స్టాప్ మోషన్లో చిత్రీకరించడం జరిగింది.

ఘటోత్కచుడు పెద్దగా మారటం:

ఈ ఎఫెక్ట్ ని ఎలా సాధించారో తెలుసుకోవటం కోసం నేను జార్జ్ మిలియేస్ తీసిన ది రబ్బర్ హెడ్ అనే లఘు చిత్రంలోని ఒక షాట్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను. ఆ షాట్లో మిలియేస్ తలలోకి గాలిని పంప్ చెయ్యగా అది పెరిగి పెద్దదవుతుంది. ఈ షాట్ ని సాధించటం కోసం మిలియేస్ కెమెరా ఎదురుగా ఒక కదిలే చక్రాల బల్ల పైన కూర్చుని మెల్లగా వెనుకకు కదిలాడు. తర్వాత ఆ షాట్ ని రివర్స్ మోషన్లో ప్లే చెయ్యటం వల్ల ఆయన తల పరిమాణం పెరుగుతున్న భ్రమ కలుగుతుంది.

జార్జ్ మిలియేస్ తల పరిణామం పెరిగే షాట్ని ఇలా సాధించారు

అలాగే, మాయాబజార్ లోని వివాహ భోజనంబు పాటలో ఎస్వీ రంగారావు ఒక చిన్న కదిలే పీట పై కూర్చుని కెమెరా దిశగా కదిలారు. ఆయన ముందున్న ఆహార పల్లాలు ఆ బల్ల కనిపించకుండా చేసాయి.

ఎగిరే లడ్డూలు:

వివాహ భోజనంబు పాటలోని లడ్డూలు వాటంతట అవే ఎస్వీ రంగారావు గారి నోట్లోకి ఎగురుతాయి. ఈ ఎఫెక్టుని సాధించటానికి ఒక పారదర్శక ట్యూబ్ని రంగారావు గారి వెనుక పెట్టి, ఆ గొట్టంలో నుండీ లడ్డూలను కిందకి వదిలారు. ఆ షాట్ ని రివర్స్ మోషన్లో ప్లే చెయ్యటం ద్వారా ఆయన నోట్లోకి లడ్డూలు ఎగురుతున్న భ్రమ కలిగించారు. ఆ లడ్డూల కదలిక వల్ల వచ్చే మోషన్ బ్లర్ని గమనించండి.

(క్రెడిట్: ఈ ఎఫెక్టు ని చిత్ర పరిశ్రమలో పనిచేసే ఒక మేకప్ మ్యాన్ డీకోడ్ చేసి తనతో చెప్పారని రిపోర్టర్ అంజిగారు తన యుట్యూబ్ ఛానల్లో తెలియజేయటం జరిగింది.)

గింబలి, గిల్పం, కదిలే పళ్ళెం, చెప్పులు మరియు ఎగిరే కర్రలు:

సింగీతం శ్రీనివాసరావు గారు మాయాబజార్ 60 వసంతాల వేడుకలో గింబలి అనబడు చాప దానంతట అది ఎలా కడిలిందనే విషయాన్ని బహిర్గతం చేసారు. ఆ చాప నిజానికి ఒక పల్చటి అల్యూమినియం షీటు. ఆ షీటు ని చాపతో కవర్ చేశారట. ఆ షీటు దానంతట అదే ముడుచుకు పోతుంది. అది ముడుచుకునే సమయానికి షాట్ని క్లోజ్ నుండీ లాంగ్ కి కట్ చేసే సమయంలో మన దృష్టిని పాత్రధారుల పై ఉండేలా చెయ్యటం వల్ల ఆ ఎఫెక్టు సాధ్యపడింది.

ఈ సీన్ని 01:25 నిమిషాల నుండి చుడండి

గిల్పం (మంచం) అనేది ఒక తయ్యారు చెయ్యబడ్డ యంత్రం అని స్పష్టంగా తెలుస్తుంది. అది మనకి నచ్చినట్టు తిరుగుతుంది.

కదిలే తమలపాకుల పళ్ళెం అనే ఎఫెక్టుని మ్యాజిక్ ట్రిక్లలో వాడే కంటికి కనిపించని ఒక సూక్ష్మ దారంతో ఆ ప్లేటుని లాగటం ద్వారా సాధించారు. అదే మాదిరి కదిలే చెప్పుల ఎఫెక్టుని సాధించారు. ఒక వేళ ఆ దారం ఫ్రేములో పడినట్లైతే దానిని ఫిల్మ్ పై బ్యాక్ గ్రౌండ్ లాగా పెయింట్ వేసి దానిని కనపడకుండా చేసారు.

ఒక స్నేహితుడి అభిప్రాయం ప్రకారం ఎగిరే కర్ర ఎఫెక్టు ని, పైనున్న గోడకు ఫిషింగ్ వైర్ వాడి కర్రని వేెలగట్టడం ద్వారా సాధించారు. ఆ తర్వాత ఆ వైరుని పైన చెప్పిన విధంగా ఫిల్మ్ పై పెయింట్ వేసి కవర్ చేసారు. కానీ అదెంత వరుకు సాధ్యమో నాకు తెలియదు. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలపండి.

కేవీ రెడ్డి, మార్కస్ బార్ట్లే ల అధ్భుత ప్రతిభ:

ఒక సారి ఈ షాట్ చూడండి:

అద్దం లోపలకి నాగేశ్వర రావు గారు వచ్చిన షాట్ని అద్దంలో కెమెరా కనపడకుండా ఎలా చిత్రీకరించారు అనుకుంటున్నారు? ఏం లేదు, నాగేశ్వర రావు గారిని ఫ్రేమ్ బయట నిలబెట్టి, కెమెరా ఆయనకి 45 డిగ్రీల కోణంలో పెట్టి అద్దంలో కెమెరా పడకుండా చూసుకున్నారు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా!? మళ్లీ ఆ షాట్ చూడండి. అద్దం పై పడ్డ నీడ నాగేశ్వర రావు గారిది. మరి చూసే ప్రేక్షకుడికి ఆ టెక్నిక్ సులభంగా కనిపించెయ్యాలి కదా.. అలా కనిపించక పోవటానికి కారణం ఆ నీడ నడుస్తున్న సావిత్రి గారిది అని భ్రమింపచెయ్యటం.

(వెనుకే స్థంభం పై నడుస్తున్న సావిత్రి గారి నీడను మీరు గమనించవచ్చు.)

ముగింపు

--

--

Harish Parthu

I am a film enthusiast. Here I analyse, appreciate and critique (predominantly) Telugu movies in a nuanced fashion.